.పొట్ట గొడ్తున్నరు

'తినే కూడును లాక్కున్నారు. 20 ఏళ్ల నుండి ఈ భూమినే నమ్ముకుని బతుకుతున్నాం. ఇప్పుడు సర్కారుదని చెబుతున్నారు. మా పొట్ట గొడుతున్నారు. ఇక బతికేదెట్ల..? మా కుటుంబం గడిచేదెట్ల..?'' కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామ దళితుల ఆవేదన ఇది. ఆ గ్రామ దళితులు తమకిచ్చిన భూముల్లో స్వేదం చిందించి రాళ్లూ రప్పలూ గుట్టలూ తొలగించారు. బీడు భూమిని సేద్యపు భూమిగా మార్చారు. తమకిదే జీవనాధారమని భావించారు. భూమి చదును చేసేందుకూ, పైర్ల సాగుకూ వేలాది రూపాయలు అప్పులు చేశారు. అయితే కొంతమంది పెత్తందారులు, రెవెన్యూ అధికారులు కుమ్మకై ఆర్నెల్ల క్రితం ఆ భూమిలో దళితులు వేసిన పత్తి పంటను ధ్వంసం చేయించారు. అది ప్రభుత్వ స్థలమంటూ ఆక్రమించారు. ప్రస్తుతం అటవీశాఖాధికారులు చెట్ల పెంపకానికి ఆ భూమిలో సర్వే చేస్తున్నారు. జీవనాధారం కోల్పోయిన దళితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్టు గ్రామంలో సర్వే నంబరు 354లో 200 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో 60 ఎకరాలను 1992వ సంవత్సరంలో 42 మంది దళితులకు ఒక్కొక్కరికి ఎకరంన్నర చొప్పున ప్రభుత్వం పట్టాలిచ్చింది. రెక్కలు ముక్కలు చేసుకొని వారాభూమని చదును చేశారు. చిలక లింగయ్య, మ్యాకల జనార్థన్‌, ఇవురాల్ల లచ్చయ్య, చిలుగ దుర్గయ్య సహా 38 దళిత కుంటుంబాలు ఈ భూమినే నమ్ముకుని జీవిస్తున్నాయి.

మూడేళ్ల తాత్కాలిక పట్టాలను అంతిమ పట్టాలుగా మార్చాలని 1994వ సంవత్సరం నుంచీ వారు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. అధికారుల్లో చలనం లేకపోయింది. 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని ఖాళీ చేయాల్సిందిగా ఆర్నెల్ల క్రితం దళితులకు నోటీసులు పంపారు. ఇది ప్రభుత్వ స్థలమనీ, దీనిని స్వాధీనం చేసుకుంటామనీ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో దళితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 2010 ఆగస్టు 8న తమకు జరిగిన అన్యాయాన్ని జిల్లా కలెక్టర్‌కు వివరించారు. తర్వాత కూడా వారికి న్యాయం జరగకపోగా ఈ స్థలాలను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. దళితుల భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్న అధికారులు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన కొంతమంది పెద్దమనుషులపై ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. ఇదే సర్వే నంబర్‌లోని కొంత భూమిని కొందరు పెత్తందారులు కబ్జా చేశారు. వారికి అధికారుల అండదండలు ఉన్నట్లు విమర్శలున్నాయి. ఆరు నెలల క్రితం దళితులు ఈ భూమిలో పత్తి వేశారు. సాగుకు ఒకొక్కరు పెట్టుబడి కింద రూ. పది వేలు చొప్పున అప్పు చేశారు. పత్తి మొక్క దశకు చేరుకుంది. పెత్తందారులు, రెవెన్యూ అధికారులు కుమ్మకై పత్తి చేలపై మేకలు, గొర్రెలను తోలి పంటను నాశనం చేయించారు. ఎత్తుపల్లాలు, రాళ్లు, రప్పలున్న ఈ భూమిని సాగులోకి తెచ్చేందుకు ఒక్కో దళిత రైతు రూ. 40 వేల వరకూ ఖర్చు చేశాడు.

పంట సాగుకు మరో రూ.10 చొప్పున అప్పు చేశాడు. 42 మంది పరిస్థితీ ఇదేవిధంగా ఉంది. తమ భూములు తమకివ్వాలని అధికారుల చూట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారుల్లో చలనం లేదు. కరీంనగర్‌ నగర పాలక సంస్థకు 25 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు తహశీల్దార్‌ ప్రమోద్‌ చెబుతున్నారు. ప్రభుత్వ జిఓ ప్రకారమే ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. కరీంనగర్‌ 2004లో కార్పొరేషన్‌గా మారింది. అంతకుముందు నుంచే ఈ దళితులకు ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేసింది. వీరంతా కాస్తులో ఉన్నారు. కావున ఈ జిఓ వారికి వర్తించదు. చొప్పదండి మండలంలో ఇప్పటికి మూడుసార్లు భూ పంపిణీ కార్యక్రమం చేపట్టినా రెవెన్యూ అధికారులు దళితులను విస్మరించారు. ఎల్లంపల్లిలో కోల్పోయిన అటవీ భూమికి బదులుగా దళితులకు చెందిన 60 ఎకరాలను అటవీశాఖకు అప్పగించేందుకు కుట్ర జరుగుతోంది. గ్రామ సర్పంచి, స్థానిక ఎంఎల్‌ఏ దళితులై ఉండి కూడా దళిత రైతులకు న్యాయం చేయలేకపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దళితులకు న్యాయం చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా నాయకులు లకీëనారాయణ కోరుతున్నారు.

కూడెవరేస్తరు ?
ఈ భూమితోనే బతుకుతున్నా. దీంట్లో వచ్చిన పంటతోనే బతుకుతున్నాం. భూమి సర్కారుదేనని అంటున్నరు. ఇక్కడ జంగల్‌ పెంచుతరట. మా భూములు మాకుగావాలె. ఇవి ఇయ్యకుంటే ఇంత విషమిచ్చి సంపుండ్రి.
మేకల పోచయ్య (బాధితుడు)
అంతిమ పట్టాలిచ్చే వరకూ పోరాటం : కెవిపిఎస్‌, వ్యకాస
దళితులకు అంతిమ పట్టాలిచ్చే వరకూ వారి పక్షాన పోరాడుతామని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడికందుల సత్యం, కెవిపిఎస్‌ జిల్లా కన్వీనర్‌ లక్ష్మీనారాయణ అన్నారు. 42 మంది దళితులకు తాత్కాలిక పట్టాలిచ్చారనీ, అంతిమ పట్టాల కోసం దళితులు ఎన్నిసార్లు మెరపెట్టుకున్నా అధికారులు కనికరించలేదనీ వాపోయారు. వెంటనే దళితులకు అంతిమపట్టాలు అందజేయాలనీ, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమాలు చేపడతామనీ హెచ్చరించారు.

ఇక చావే గతి
ప్రభుత్వం పట్టాలిచ్చింది. ఈ భూమి నాదేననుకున్నా. రూ. 40వేలు అప్పుచేసి బీడు భూమిని మంచిగా చేసుకున్న. ఈ ఏడు మరో 10వేలు అప్పుజేసి పత్తివేశా. 20 ఏళ్లుగా లేనిది ఇప్పుడొచ్చి ఈ భూమి సర్కారుదంటున్నారు. నాకిక చావేగతి.
ఇవురాల్ల చిన్న లచ్చయ్య (బాధితుడు)
  • పెత్తందారుల కబ్జాకు అధికారుల అండ
ప్రజాశక్తి - కరీంనగర్‌ టౌన్