అపశ్రుతులు - సంపాదకీయం

అపశ్రుతులు
- సంపాదకీయం

రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికీ తెలంగాణ ఉద్యమానికీ మధ్య కొద్దిరోజులుగా వివాదానికీ ఉద్రిక్తతకీ కారణమైన 'మిలియన్ మార్చ్' గడచిపోయింది. ఉద్యమనేతలు ఆశించినట్టు మహాజన సమీకరణ కాకుండా అడ్డుకోగలిగామని పోలీసు యంత్రాంగం సంతృప్తి చెందవచ్చు. ఎన్ని అవరోధాలు కల్పించినా ఎన్ని అరెస్టులు చేసినా చివరకు టాంక్‌బండ్‌లోకి చొచ్చుకుని వెళ్లామని ఉద్యమనాయకులు గర్వపడవచ్చు.

ప్రజాస్వామిక స్ఫూర్తి, సామరస్యం, శాంతియుత వ్యవహారసరళి-విలువలుగా అంగీకరించి ఉంటే - ఎవరి జయగీతికను వారు పాడుకోవడం కాకుండా ఉభయ వర్గాలూ తమ తమ లక్ష్యాలు సాధించగలిగి ఉండేవి. దురదృష్టవశాత్తూ అట్లా కాక, నిరంకుశమైన నిర్బంధ చర్యలకు, అనాగరికమైన విగ్రహ విధ్వంసాలకు, మీడియా ప్రతినిధులపై దౌర్జన్యానికీ 'మిలియన్ మార్చ్' సందర్భం వేదిక అయింది.

ప్రభుత్వాలు అమలుచేసే అణచివేతలను, ఉద్యమాలలో జరిగే అరాచక చర్యలను ఒకే గాటన కట్టకూడదు నిజమే కానీ, ప్రజా లక్ష్యాల కోసం, మెరుగైన వ్యవస్థల కోసం పనిచేసే ఉద్యమాల సరళి ఆదర్శవంతంగా ఉండాలనీ, ప్రజాస్వామికంగా ఉండాలనీ. కోరే మార్పును ముందే స్ఫురింపజేసేంత న్యాయంగా ఉండాలనీ సభ్య సమాజం ఆశిస్తుంది.

'మిలియన్ మార్చ్' కార్యక్రమమే పట్టింపుల కారణంగా వివాదాస్పదం అయింది. అక్కడికీ ఉద్యమనాయకత్వం విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాన్ని కుదించుకుని, పరిమితమైన సమయంలో జరపాలని నిర్ణయించింది. జనసమీకరణను నివారించాలనో, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలో తెలియదు కానీ, పోలీసు యంత్రాంగం అవసరానికి మించి వ్యవహరించిందనే అభిప్రా యం కలిగింది.

గురువారం ఉదయం నుంచి నగరాన్ని పోలీసు వలయంలో దిగ్బంధంచేయడం వల్ల పరీక్షార్థులకు, సాధారణ పౌరులకు కూడా ఇబ్బంది కలిగింది. పోలీసుల వ్యూహాన్ని ధిక్కరించి కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఉత్సాహంలో ఉద్యమనేతలు వారి పథకాలు వారు రచించారు. అవరోధాలను అ«ధిగమించి చెప్పిన సమయానికి తెలంగాణవాదులు టాంక్‌బండ్‌పైకి చేరుకోగలిగారు. రకరకాల మార్గాలనుంచి వచ్చిన బృందాలు టాంక్‌బండ్‌పై వేలాది జనసమూహంగా మారారు.

నాయకులను, ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడంతో, టాంక్‌బండ్ మీద సమీకృతులైన జనంపై నియంత్రణ లేకపోయింది. పొద్దుటినుంచి టాంక్‌బండ్‌ను నిర్మానుష్యం చేసిన పోలీసులు తీరా 'మార్చ్' సమయానికి ప్రేక్షకమాత్రులుగా మిగిలిపోయారు. ఆ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న ఆందోళనకారుల్లో కొందరు విధ్వంసకులుగా అవతారమెత్తారు. విగ్రహాలను పగులగొట్టడం ఖాళీ చేతులతో అయ్యే పని కాదు కాబట్టి, ఆ పనిచేసిన వారు ముందస్తు ఏర్పాట్లతోనే వచ్చి ఉంటారు.

ఎన్టీయార్ హయాంలో టాంక్‌బండ్‌పై ప్రతిష్ఠించిన తెలు గు ప్రముఖులు, వైతాళికుల విగ్రహాలను ధ్వంసం చేశారు. కొన్నిటిని హుస్సేన్‌సాగర్‌లో విసిరివేశారు. ఆందోళనకారులు దాడి చేసిన విగ్రహాలలో జాషువా, త్రిపురనేని రామస్వామిచౌదరి, బ్రహ్మనాయుడు, శ్రీశ్రీ వంటి సామాజిక సంస్కర్తలు, ప్రజాకవులు కూడా ఉన్నారు. దాడికి గురైన విగ్రహాలు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మహావ్యక్తులవి అయినప్పటికీ, వారికి అభిమానులు, అనుయాయులు తెలంగాణతో సహా అన్ని ప్రాంతాలలో నూ ఉన్నారు.

విగ్రహ విధ్వంసం ఆయా అభిమానులకు తీరని మనస్తాపం కలిగిస్తుంది. ఈ దుందుడుకు చర్య తెలంగాణ ఉద్యమానికి తెచ్చే అప్రతిష్ఠ కూడా చిన్నదేమీకాదు. వివేకం స్థానంలో ఉద్వేగాలకూ ఉద్రేకాలకూ పెద్దపీట వేస్తే ఉద్యమాలే న ష్టపోతాయి. విగ్రహ విధ్వంసాన్ని తాము సమర్థించబోమని, అటువంటి చర్యలు వాంఛనీయాలు కావని తెలంగాణ ఉద్యమ ప్రముఖ నేతలందరూ ప్రకటించడం ఆహ్వానించదగింది. మున్ముందు ఇటువంటివి జరగకుండా వారు జాగ్రత్తపడితేనే వారి ప్రకటన సార్థకమవుతుంది. ఇక, మీడియామీద జరిగిన దాడి అయితే దుర్మార్గమైనది.

తెలంగాణ ఉద్యమాన్ని చిత్రీకరిస్తూ, పోలీసుల చేతిలో దౌర్జన్యానికి గురిఅయేదీ, ఇటువంటి సందర్భాలలో ఉద్యమకారుల ఆగ్రహావేశాలకు లక్ష్యమయ్యేదీ మీడియాసంస్థల ప్రతినిధులూ, వాహనాలే కావడం విషాదకరం. టాంక్‌బండ్ మీద ఆందోళనకారుల చేతిలో అన్ని మీడియా చానెళ్లకు చెందిన ఇరవైకి పైగా కెమెరాలు ధ్వంసమయ్యాయి. ఒక చానెల్ ఓబీ వ్యాన్‌ను దగ్ధం చేశారు, మరోదాన్ని ధ్వంసం చేశారు. కెమెరామన్‌లపై, పత్రికా ప్రతినిధులపై చే యిచేసుకున్నారు.

ఉద్యమ సందర్భంలో పోలీసు అణచివేతలను చూపిస్తే పోలీసులకు, ఆందోళనకారుల అరాచకాన్ని చిత్రిస్తే ఉద్యమకారులకు సహించకపోతే, ఇక పత్రికాసంస్థలు, చానెళ్లు ఏమిచేయాలి? ప్రతి మీడియా సంస్థా, ఉద్యమాలను, సంఘటనలను తమదైన ప్రత్యేకమైన రీతిలో చూస్తాయి, వ్యాఖ్యానిస్తాయి. అవి కొన్నిసార్లు ప్రభుత్వానికి, మరి కొన్ని సందర్భాలలో ప్రజలలోని వివిధ వర్గాలకు రుచించకపోవచ్చు.

తాము ఇష్టపడనిదాన్ని నిరోధించాలనే వైఖరి ఎవరు అనుసరించినా గర్హనీయమే. అటువంటి నియంత్రణ ఎవరు చేసినా అది అప్రజాస్వామిక మే. మీడియా అంటూ ఒకటి ఉంటేనే, సత్యం ఎక్కడో ఒకచోట ఏదో ఒకరూపంలో కనీసంగానైనా ప్రజల ముందుకు వస్తుంది. దాన్ని కోల్పోతే, దాని నోరుమూస్తే మొదట నష్టపోయేది ప్రజా ఉద్యమాలే. మీడియా మీద ఒంటికాలితో లేవడం ఈ మధ్య ప్రతి ఉద్యమానికీ అలవాటుగా మారింది. ఆ ధోరణి తమకు తాము హాని చేసుకునేదే తప్ప, మేలుచేసేది కాదు.

సమస్యలను పరిష్కరించే దిశగా కాక, నిరవధికంగా నానబెట్టే తీరులో వ్యవహరించ డం వల్ల శాంతియుత ఉద్యమాలు కూడా ఎట్లా కలుషితమవుతాయో గురువారం నాటి పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఆందోళనకారుల్లో వ్యక్తమైన అసహనం, ఉద్యమానికి సానుకూలంగా ఉన్న కాంగ్రెస్ ఎంపీలను కూడా వదలలేదు. సాక్షాత్తూ కెసిఆర్ కూడా దూషణలను ఎదుర్కొన్నారు.

తెలంగాణ విషయంలో పరిష్కారం దిశగా అడుగులు వేయడానికి కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్‌పార్టీకి-వాటి సొంత సమస్యలు వాటికి ఉండి ఉండవచ్చు. ఉద్యమాన్ని నిర్వహిస్తున్న పార్టీలకు సంస్థలకు ఎవరి ఒత్తిళ్లు వారికి, ఎవరి పరిమితులు వారికి ఉండవచ్చు. నిర్ణయంకోసం నిరీక్షిస్తున్న ప్రజలకు ఎవరిమీదా విశ్వా సం లేని పరిస్థితి నెలకొన్నది. అది సమాజానికి మంచిది కాదు. పారదర్శకమైన, వాస్తవికమైన ఆచరణశైలి ద్వారా ఉద్యమనాయకత్వం తమ కార్యకర్తల, సానుభూతిపరులలోని అవిశ్వాసాన్ని తొలగించడం అవసరం.
ఈ అపశ్రుతులను మినహాయిస్తే, మిలియన్ మార్చ్ మొత్తం మీద ప్రశాంతంగానే జరిగినట్టు భావించి ప్రభుత్వం ఊపిరిపీల్చుకోవచ్చు. వ్యాపించిన భయాందోళనల దృష్టి తో చూస్తే, జరిగింది తక్కువే కావచ్చు. కానీ, గురువారం నాటి టాంక్‌బండ్ సంఘటనల నుంచి అన్నిపక్షాలూ నేర్చుకోవలసింది, గ్రహించవలసింది చాలా ఉన్నది. అనిశ్చితస్థితి ఎక్కువకాలం కొనసాగితే అది అరాచకానికి దారితీసే ప్రమాదం ఉన్నది. ఏ నిర్ణయమూ లేకుండా ఇదేస్థితి కొనసాగితే, అసహనం పెరిగిపోయి, పరిస్థితి చేయిదాటిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అప్పుడు ఆకులు పట్టుకుని లాభం లేదు.ఆంధ్ర జ్యోతి సౌజన్యముతో 

ఎస్సీ, ఎస్టీ కాలనీలకు పక్కా దారులు

ఎస్సీ, ఎస్టీ కాలనీలకు పక్కా దారులు
'ఉపాధి'కి అదనంగా 'అభివృద్ధి' పనులు

హైదరాబాద్, మార్చి 8 : ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టనున్న అంతర్గత రహదారుల నిర్మాణాన్ని ఇక పక్కా దారులుగా నిర్మించనున్నారు. ఉపాధి నిధులతో ఎస్సీ, ఎస్టీ కాలనీలకు, మారు మూల ప్రాంతాలకు అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఇలాంటి రహదారులను పక్కాగా నిర్మిస్తే బాగుంటుందని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ చేసిన ప్రతిపాదనలకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం ఆమోదం తెలిపారు.

ఈ మేరకు తాజా మార్గదర్శకాలతో మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాత సమితుల (బ్లాకులు) పరిధిలో కేవలం మూడు గ్రామాలనే 2011-12లో ఈ పక్కా రోడ్లకు ఎంపిక చేయనున్నారు. విజయనగరం, విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఈ పక్కా రోడ్లను నిర్మిస్తారు.

మాదిగ రచయిత్రిలు

Writers

madiga rajakiya nayakulu

కపాడియా సుప్రీం న్యాయమేవ జయతే! చాన్నాళ్ల తర్వాత 'సుప్రీం' గర్జనలు

కపాడియా సుప్రీం
న్యాయమేవ జయతే!
చాన్నాళ్ల తర్వాత 'సుప్రీం' గర్జనలు
న్యాయ వ్యవస్థ క్రియాశీలత మొదలు

ప్రభుత్వానికి , యంత్రాంగానికి చెమటలు
జస్టిస్ కపాడియా రాకతో మారిన దృశ్యం
సమగ్ర వ్యక్తిత్వమే ఆయన ఆస్తిపాసులు
పేద కుటుంబంలో పుట్టి, బాయ్‌గా మొదలెట్టి అత్యున్నత స్థాయికి చేరుకున్న జస్టిస్
బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే 'ఆర్డర్'
అనేక సంచలన మార్పులు, వ్యాఖ్యలు
గమనిస్తున్నారా? పలు ప్రభుత్వ విభాగాలకు ఉన్నట్టుండి చురుకు పుట్టింది. 'అసంభవం' అనుకున్నవి అనేకం జరిగాయి. ఉదాహరణలు చెప్పాలా!
'వందలమంది ఎంపీల మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగే, నా మీదా ఉన్నాయి. నేను మాత్రం ఎందుకు దిగి పోవాలి?'... అని బల్లగుద్ది వాదించిన సీవీసీ థామస్ ఒక్కదెబ్బతో రాజీనామా చేశారు.

'నేను తప్పు చేయలేదు. రాజీనామా చేసేది లేదు' అంటూ 'సెల్లు' కబుర్లు చెప్పిన డీఎంకే నేత ఎ.రాజా చివరికి టెలికం మంత్రి పదవిని వదులుకున్నారు.
వేలకోట్ల నల్లధనం కేసులో చోద్యం చూస్తూ కూర్చున్న సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పరుగులు తీసి మరీ హసన్ అలీని అరెస్టు చేశారు.

వీటన్నింటికీ ఒకే కారణం! అది... భారత సర్వోన్నత న్యాయస్థానం! ఇంకొంచెం నిర్దిష్టంగా చెప్పాలంటే... భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.హెచ్.కపాడియా. గత ఏడాది మే 12న ఆయన ఈ పదవి చేపట్టారు. ఆ రోజు నుంచే... అన్ని వ్యవస్థలకు చురుకు పుట్టిస్తున్నారు. ప్రభుత్వాలు ఎంతమాత్రం జీర్ణించుకోలేని, సహించలేని 'న్యాయ వ్యవస్థ క్రియాశీలత'కు ఆయన మళ్లీ తలుపులు తెరిచారు. అదికూడా... మరెవరూ ప్రశ్నించలేనంత సమర్థంగా!

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాలకృష్ణన్ హయాంలో సుప్రీంకోర్టుకు పట్టిన మరకలు, కర్ణాటక మాజీ ప్రధాన న్యాయమూర్తి దినకరన్ దెబ్బతో మొత్తం న్యాయ వ్యవస్థకు పట్టిన మసకలు... జస్టిస్ కపాడియా వచ్చాక తొలగిపోతున్నాయి. 'ఆయన వచ్చాక పరిస్థితి మారిపోయింది. సుప్రీంకోర్టు పనితీరూ మారిపోయింది' అని సీనియర్ న్యాయవాదులు స్వయంగా చెబుతున్నారు.

జస్టిస్ కపాడియా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సహా సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలపై పడిన అక్షింతలకు లెక్కేలేదు. సుప్రీంకోర్టు ఆ స్థాయిలో ప్రతిస్పందించడం వల్లే అనుకోని సంఘటనలెన్నో జరిగాయి. కీలక కేసుల్లో సుప్రీం చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేయాలంటే... న్యాయమూర్తి వద్ద సత్తా ఉండాలి. వేలెత్తి చూపలేని వ్యక్తిత్వం ఆయన సొంతం కావాలి. జస్టిస్ కపాడియా ఆస్తిపాస్తులన్నీ... అవే! "నాకు ఉన్న ఏకైక ఆస్తి... వ్యక్తిత్వమే'' అని జస్టిస్ కపాడియా సగర్వంగా చెప్పుకొంటారు. ఆఫీస్ బాయ్‌గా సీనియర్ న్యాయవాదుల ఫైళ్లను మోసిన జస్టిస్ కపాడియా... ఇప్పుడు న్యాయ వ్యవస్థలోనే అత్యున్నత స్థానానికి ఎదగడానికి ఆయన పట్టుదలేకాదు... వ్యక్తిత్వమూ దోహద పడింది.

ఆర్డర్... ఆర్డర్
అన్ని వ్యవస్థలపై వ్యాఖ్యలు చేస్తూ, తీర్పులు ఇచ్చే న్యాయ వ్యవస్థ స్వచ్ఛంగా ఉండాలన్నది జస్టిస్ కపాడియా అభిప్రాయం. కానీ... ఈ వ్యవస్థలోనూ లోపాలు ఉన్నాయని ఆయన నిర్భయంగా అంగీకరించారు. తాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే వ్యవస్థను 'ఆర్డర్'లో పెట్టే పని ప్రారంభించారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ హయాంలో మూడేళ్లపాటు నడిచిన పద్ధతులకు స్వస్తి పలికారు.

కేసులను విచారణకు చేపట్టాల్సిందిగా మౌఖికంగా కోరడం కుదరదని తేల్చిచెప్పారు. "ఓరల్ మెన్షనింగ్‌ను అనుమతించేది లేదు. కేసులు సంబంధిత విభాగం ద్వారానే రావాలి'' అని తెలిపారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలకు (పిల్స్) ప్రాధాన్యం ఇస్తూనే... ఆషామాషీగా పిల్స్ వేస్తే సహించేది లేదని తొలి రోజునే హెచ్చరించారు. పిల్ విచారణార్హమైనదని భావిస్తే మాత్రం... అది ఎవరిదైనా, ఎవరిపైనైనా సరే స్వీకరిస్తారు.

దీనికి... జస్టిస్ బాలకృష్ణన్‌పై అందిన వ్యాజ్యమే ఉదాహరణ. 'న్యాయ వ్యవస్థ లోపాలకు అతీతం కాదు' అంటూ ఈ పిల్‌ను విచారణ చేపట్టారు. జస్టిస్ కపాడియా బడా వ్యవస్థలు, బడా బాబులపై ఎంత నిక్కచ్చిగా ఉంటారో... సామాన్యుల విషయంలో అంతే మానవత్వం ప్రదర్శించే న్యాయమూర్తిగా పేరు తెచ్చుకున్నారు.

"కేసు ఏదైనా సరే! కార్మికులు ఉద్యోగం కోల్పోకూడదు'' అంటూ కార్మికులకు సంబంధించిన కేసులపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించారు. జస్టిస్ కపాడియా నేతృత్వంలో సుప్రీం వెలువరించే తీర్పులపై కేంద్ర ప్రభుత్వం కూడా శిరసావహిస్తోంది. విపక్షాలు, మీడియా ఎంత గగ్గోలు చేసినా పట్టించుకోని ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం థామస్ విషయంలో తప్పు చేశానని అంగీకరించాల్సి వచ్చింది. దటీజ్... జస్టిస్ కపాడియా!

ఆయన వచ్చాక...
జస్టిస్ కపాడియా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెలువడిన సంచలన తీర్పులు, చోటు చేసుకున్న పరిణామాలు...

* 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో సుప్రీం చేసిన వ్యాఖ్యలు, ఆదేశాల వల్లే ఇందులోని విషయాలన్నీ ఒకొక్కటిగా బయటపడ్డాయి. సీబీఐ దర్యాప్తు గాడిన పడింది. రాజా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ప్రధానిని కూడా వదల్లేదు. 'ఏమిటీ మౌనం! బదులివ్వండి' అంటూ ప్రధానిని ఆదేశించింది.
* సీవీసీగా థామస్ నియామకం చెల్లదని జస్టిస్ కపాడియా తేల్చిచెప్పారు. దీంతో థామస్ రాజీనామా చేయక తప్పలేదు.
* హసన్ అలీఖాన్ కేసులో సీబీఐ, ఈడీ, ఐటీ విభాగాలను పరుగులు తీయించింది.
* అత్యాచారానికి గురైన మానసిక వికలాంగులు కూడా పిల్లల్ని కనొచ్చని సుప్రీం చెప్పింది.
* నార్కో అనాలిసిస్, బ్రెయిన్ మ్యాపింగ్, పాలిగ్రాఫ్ వంటి సత్యశోధన పరీక్షలను నిందితుడు అంగీకరిస్తేనే చేయాలని ఆదేశించింది.
* కేంద్ర ప్రభుత్వ విధానాలు, సిద్ధాంతాలతో విభేదించారనే నెపంతో గవర్నర్లను తొలగించడం కుదరదని స్పష్టం చేసింది.
* తాజాగా... కారుణ్య హత్యలకు ససేమిరా అంటూనే, కొ న్ని నిర్దిష్ట మార్గదర్శకాలకు లోబడి ప్రాణాధార వ్యవస్థలను స్తంభింప చేయడంద్వారా బాధితులకు 'విముక్తి' కల్పించవచ్చని తెలిపింది. జూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారిపై కేసులు పెట్టడం తగదని పేర్కొంది. 'వారికి సాయం చేయాలి. శిక్షించొద్దు' అని తెలిపింది. గౌరవనీయులైన కృష్ణయ్యర్‌గారికి
నేను సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చాను. నాలుగో తరగతి ఉద్యోగిగా జీవితం ప్రారంభించాను. నా ఏకైక ఆస్తి... నాకున్న వ్యక్తిత్వమే. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పటికీ... తీర్పులు చెప్పే సమయంలో పీడితులు, గిరిజనులు, కార్మికుల సంక్షేమానికి దోహదపడే పరిజ్ఞానాన్ని మాత్రమే ఉపయోగించాను. ప్రధాన న్యాయమూర్తిగా రాజ్యాంగం నాకు అప్పగించిన బాధ్యతలు నెరవేర్చగలననే నమ్మకం ఉంది.
- తనకు అభినందన సందేశం పంపిన జస్టిస్ కృష్ణయ్యర్‌కు జస్టిస్ కపాడియా రాసిన లేఖ

ఇదీ ప్రస్థానం...
జస్టిస్ సరోష్ హోమీ కపాడియా గుజరాత్‌కు చెందిన పార్సీ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి గుమాస్తా. తల్లి గృహిణి. కుటుంబానికి ఆర్థికంగా సహకరించేందుకు, తమ్ముడి చదువుల కోసం కపాడియా తన చదువులను త్యాగం చేశారు. బెహ్‌రామ్‌జీ జీజీభాయ్ న్యాయవాద కార్యాలయంలో బాయ్‌గా చేరారు. లాయర్ల ఫైళ్లు మోయడం, వాళ్లు చెప్పిన పనులు చేయడం ఆయన బాధ్యతలు. ఆ తర్వాత న్యాయవాది అయ్యారు.
1974లో ఇన్‌కమ్ ట్యాక్స్ తరఫు న్యాయవాది అయ్యారు. 1991లో బొంబాయి హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. రెండేళ్లలోనే ఆయన పర్మినెంట్ జడ్జి అయ్యారు. పర్యావరణం, బ్యాంకింగ్, పరిశ్రమలు, పన్నులకు సంబంధించిన కేసులను చేపట్టారు. 1999లో కేతన్ ఫరేఖ్ కేసులో విచారణ జరిపింది ఆయనే. 2003 ఆగస్టు 5న కపాడియా ఉత్తరాంచల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లారు. అదే సంవత్సరం డిసెంబర్‌లో సుప్రీం న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 మే 12వ తేదీన భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.ఆంధ్ర జ్యోతి సౌజన్యముతో పొందుపరిచినము 

ప్రమాణాలు పాటించని కాలేజీల యాజమాన్యాలకు

ప్రమాణాలు పాటించని కాలేజీల యాజమాన్యాలకు..
జైలు.. జరిమానా!
మూడేళ్ల ఖైదు.. 3 లక్షల ఫైను

వృత్తి విద్యా కాలేజీలపై రాష్ట్ర సర్కారు పట్టు
కోచింగ్ సెంటర్లు, డిగ్రీ కాలేజీలపైనా నియంత్రణ
తనిఖీలు, చర్యలకు అధికారం
రాష్ట్ర విద్యా చట్టానికి సవరణ
ఈ సమావేశాల్లోనే బిల్లు
హెచ్చరిక!
ఫీజులే తప్ప ప్రమాణాలు పట్టని...
పైపై మెరుగుల భవనాలు తప్ప
లోపల వసతులు కల్పించని...
విద్యార్థులున్నప్పటికీ
తగిన ఫ్యాకల్టీని నియమించని...
సరైన ప్రయోగ శాలలు,
మౌలిక సదుపాయాలు లేని...
ప్రైవేటు వృత్తి విద్యా కాలేజీలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న హెచ్చరిక! ఇలాంటి కాలేజీల యాజమాన్యాలు కటకటాలు లెక్కించక తప్పదు. భారీ జరిమానా కట్టక తప్పదు. గరిష్ఠంగా రూ.3 లక్షలు జరిమానా విధించేందుకు, మూడేళ్లపాటు జైలుకు పంపేందుకు తగిన చట్టం తయారవుతోంది. ఈ కాలేజీల గుర్తింపును ఉపసంహరించే అవకాశమూ ఉంది.

హైదరాబాద్, మార్చి 8 : ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి వృత్తి విద్యా కళాశాలలతోపాటు... డిగ్రీ, పీజీ కాలేజీలన్నింటిపైనా పట్టుబిగించేందుకు సర్కారు సిద్ధమైంది. ఉన్నా లేనట్లుగా, అసలు ఉందో లేదో అన్నట్లుగా తయారైన విద్యా చట్టం - 1982కు కొత్త కోరలు తొడుగుతోంది. ఈ చట్టానికి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే సవరణ చేపట్టాలని నిర్ణయించింది. అదే జరిగితే... ఈ కళాశాలలన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఆజమాయిషీ కిందకు వచ్చినట్లే! మరి... ఇప్పటిదాకా ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలలపై సర్కారు నియంత్రణ లేదా అనే సందేహం రావచ్చు!

ఔను... నిజంగానే లేదు! చలో అంటూ ఢిల్లీకి వెళ్లడం, అక్కడ ఏఐసీటీఈకి వెళ్లి అనుమతులు తెచ్చుకోవడం! ఇక్కడ కాలేజీలు పెట్టడం! ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ కాలేజీలన్నింటికీ ఏఐసీటీఈ అనుమతులు ఇస్తుంది. బీఈడీ కళాశాలలకు మాత్రం ఎన్‌సీటీఈ అనుమతి అవసరం. వెరసి... ప్రైవేటు వృత్తి విద్యా కాలేజీలపై మొత్తం ఆజమాయిషీ ఢిల్లీదే. వీటిలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర శూన్యం. ఇప్పటికే అవసరానికి మించి ఉన్నాయంటున్నా, ఇక ఏమాత్రం అవసరం లేదంటున్నా... ఏఐసీటీఈ తన మానాన తాను ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు ఇస్తూనే ఉంది.

దీంతో... రాష్ట్రంలో ఇవి పుట్టగొడుల్లా వెలిశాయి. వీటి సంఖ్య పెరిగే కొద్దీ ప్రమాణాలు పడిపోతున్నాయి. కొన్ని పేరున్న కాలేజీలు మినహా... మిగిలిన కళాశాలల యాజమాన్యాలు వసతుల కల్పనకు తిలోదకాలు ఇచ్చేశారు. సీట్లు అమ్ముకోవడం, డొనేషన్లు, క్యాపిటేషన్ ఫీజుల రూపంలో డబ్బు పిండుకోవడం అంతా వాళ్ల ఇష్టారాజ్యం. ఢిల్లీలో ఉండే ఏఐసీటీఈ అధికారులు ఇవేమీ పట్టించుకోరు. తూతూ మంత్రపు తనిఖీలే తప్ప... కఠినమైన చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. కళ్లముందు ఘోరాలు జరుగుతున్నా... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చూస్తూ కూర్చోవాల్సిందే!

ఈ కాలేజీలపై ఎలాంటి చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర సర్కారుకు లేదు. ఒకవేళ ఏవైనా చర్యలు తీసుకున్నా... కాలేజీలు వెంటనే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాయి. మన విద్యా చట్టం బలహీనంగా ఉండటమే దీనికి కారణం. ఈ పరిస్థితిని గమనించిన కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే తమతమ విద్యా చట్టాన్ని సవరించుకున్నాయి. ప్రైవేటు వృత్తి విద్యా కాలేజీలపై నియంత్రణ సాధించాయి. ఇప్పుడు... మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది.

కోట్లు వెచ్చిస్తున్నా...
వృత్తి విద్యా కాలేజీలో చదివే బడుగు, బలహీన వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థుల ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ కోసం సర్కారు ఈ ఏడాది రూ.2815 కోట్లు ఖర్చు చేసింది. సరైన వసతులు లేని కాలేజీలకు ప్రభుత్వం చెల్లించే సొమ్ము బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది. ఇటీవల ఫీజుల చెల్లింపు విషయంలోనే రచ్చ రచ్చ అయిన సంగతి కూడా తెలిసిందే. 'ఖర్చు పెట్టే సొమ్ముకు సార్థకత, విద్యార్థులకు న్యాయం' జరగాలంటే కాలేజీలు ప్రమాణాలు పాటించేలా చూడాలని, వీటిపై రాష్ట్ర ప్రభుత్వ ఆజమాయిషీ కూడా ఉండాలని భావించారు.

'ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ కోసం కాలేజీల బెదిరింపులు సరే! మరి... వాటిలో వసతుల మాటేమిటి?' అంటూ గవర్నర్ నరసింహన్ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిజానికి... దామోదర రాజ నరసింహ ఉన్నత విద్యా శాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే ఈ అంశంపై దృష్టి సారించారు. రాష్ట్ర విద్యా చట్టానికి అవసరమైన సవరణలు తీసుకురావడం ద్వారా వివిధ వర్సిటీలకు అనుబంధంగా ఉన్న అన్నిరకాల కాలేజీలపై ప్రభుత్వ నియంత్రణాధికారం ఉండేలా చూడాలని భావిస్తున్నారు.

"ఉన్నత విద్యలో ప్రమాణాలు పాటించాలంటే కఠినంగా ఉండక తప్పదు. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నందున రాష్ట్రానికి కూడా అధికారాలు ఉండాలి. ఈ దిశగా రాష్ట్ర విద్యా చట్టాన్ని సవరించడం కేంద్రాన్ని సవాల్ చేసినట్లు కాదు'' అని మంత్రి పలుమార్లు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏఐసీటీఈ నిబంధనలకు లోబడే మన విద్యా చట్టానికి సవరణలు తీసుకువస్తున్నందున ఇబ్బందులు తలెత్తబోవని ఆయన తెలిపారు. అందుకే... విద్యా చట్టం-1982కు సవరణలు సిఫారు చేయాల్సిందిగా కమిటీని ఏర్పాటు చేశారు.

ఉన్నది చాలదు...
రాష్ట్రంలో విద్యా చట్టం - 1982 ఇప్పటికే అమలులో ఉంది. కానీ... ఇది కోరలు లేని పాములాంటిది. దీని రూపకల్పన సమయంలో అనేక విషయాలు విస్మరించారు. జేఎన్‌టీయూ వంటి విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్న ప్రైవేట్ కాలేజీలు కూడా ఈ చట్టం పరిధిలో లేవు. ఈ చట్టం సవరణపై నియమించిన కమిటీ మరో రెండు రోజుల్లో తన నివేదికను సమర్పించనుంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... అన్ని రకాల అఫిలియేటెడ్ డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కాలేజీలన్నింటినీ చట్ట పరిధిలోకి తీసుకు రావాలని కమిటీ సిఫారసు చేయనుంది. అలాగే... ఎలాంటి జవాబుదారీతనం లేకుండా నడుస్తున్న కోచింగ్ సెంటర్లు, బిజినెస్ స్కూళ్లపైనా ప్రభుత్వానికి నియంత్రణ వస్తుంది. ప్రమాణాలు, నిబంధనలను కాలరాసే కాలేజీ యజమానులకు చట్టం ఉల్లంఘనల తీవ్రతను బట్టి ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించేలా కసరత్తు జరుగుతోంది.

ప్రస్తుతం గరిష్ఠంగా ఆరు నెలల జైలు, రూ.వెయ్యి వరకు మాత్రం జరిమానా విధించే అవకాశముంది. ఇకపై... చట్ట విరుద్ధంగా క్యాపిటేషన్ ఫీజులు, డొనేషన్లు వసూలు చేసినా, ఇష్టానుసారంగా సీట్లు అమ్ముకున్నట్లు రుజువైనా చర్యలు తీసుకుంటారు. చట్టాన్ని అమలు చేయకపోతే ఒక రకమైన శిక్ష , అధికారులను తనిఖీలు చేయకుండా అడ్డుకుంటే మరో రకమైన శిక్ష ఉండాలని కమిటీ సిఫారసు చేయనున్నట్లు తెలిసింది.

మే తర్వాత మహిళా బిల్లుపై చర్చలు త్వరలో అన్ని పార్టీలతో స్పీకర్ సమావేశం

మే తర్వాత మహిళా బిల్లుపై చర్చలు
త్వరలో అన్ని పార్టీలతో స్పీకర్ సమావేశం
లోక్‌సభలో చర్చ సందర్భంగా నిర్ణయం

న్యూఢిల్లీ, మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కల్పనకు రాజకీయ పార్టీలు ఓటేశాయి. అయితే, వారికి ఎంత కోటా కల్పించాలన్న అంశంపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశాయి. లోక్‌సభలో మంగళవారం చర్చ జరిగింది. అయితే, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రస్తుత రూపంలోనే బిల్లును ప్రవేశపెడితే ఒప్పుకొనేది లేదని సమాజ్‌వాదీ, ఆర్జేడీ, జేడీయూలు హెచ్చరించాయి.

తొలుత ఈ అంశాన్ని లేవనెత్తిన బీజేపీపక్ష నేత సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ.. "16 ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఏకాభిప్రాయాన్ని తీసుకురావాల్సిన సమయం ఇదే'' అని స్పీకర్‌కు ఆమె విజ్ఞప్తి చేశారు. దీంతో, సుష్మా స్వరాజ్ వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని లోక్‌సభాపక్ష నేత ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాల్సిందిగా మీరాకుమార్‌ను కోరారు. దీంతో, అసెంబ్లీ ఎన్నికల తర్వాత సమావేశం ఏర్పాటు చేసేందుకు స్పీకర్ అంగీకరించారు.