ట్యాంక్‌బండ్‌పై కొమురం విగ్రహం
హైదరాబాద్, మేజర్‌న్యూస్: తెలంగాణ సాయుధ పోరా ట యోధుడు కొమురం భీమ్ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికోసం గిరిజన శాఖ రూ.8 లక్షలను విడుదల చేయ నుంది. కొమురం భీమ్ విగ్రహం నమూనా ఇప్పటికే తయారైందని, నిధులు విడుదలైన వెంటనే విగ్రహాన్ని నెలకొల్పే పనులను వేగవంతం చేస్తామని సాంస్కృతిక శాఖ మండలి ఛైర్మన్ ఆర్వీ రమణమూర్తి, డైరెక్టర్ కాంతారావు తెలిపారు. శనివారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ట్యాంక్‌బండ్‌పై మొత్తం 33 విగ్రహాలు ఉన్నాయని, వాటికి అదనంగా అదే వరుసలో కొమురం భీమ్ విగ్రహాన్ని నెలకొల్పుతామని అన్నారు.ధ్వంసమైన విగ్రహాల పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. పునరుద్ధరణ పనుల కోసం ప్రభుత్వం రూ.75 లక్షలను మంజూరు చేసిందని, నిధులు విడుదల కావాల్సి ఉందని అన్నారు. విగ్రహాల రూపురేఖలు, ఎత్తు వంటి అంశాలపై చర్చించడానికి ఈ నెల25న ప్రముఖ శిల్పాచార్యులతో సమావేశాన్ని ఏర్పా టు చేసినట్లు చెప్పారు. ఈ సమావేశం అనంతరం సాంకేతిక, ఆర్థిక కమిటీలను వేర్వేరుగా ఏర్పాటు చేస్తా మని, ఈ రెండు కమిటీలు ఇచ్చే నివేదికలు, ప్రభుత్వం రూపొందించే నిబంధనల మేరకు విగ్రహాలను పునరు ద్ధరిస్తామని అన్నారు. ప్రస్తుతం ఈ పనులు టెండర్ల దశ లో ఉన్నాయని అన్నారు.
23 నుంచి ‘శతరూప’
ఈ నెల 23నుంచి పది జిల్లాల్లో పది రోజులు చొప్పున ‘శతరూప’ కళా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఆయా జిల్లాల్లో పేరుపొందిన జానపద కళారూపాలతో ప్రదర్శనలను ఏర్పాటు చేస్తా మని అన్నారు. 23న విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అన్నారు. అనంతరం వచ్చేనెల 2న ఏలూరు, 14న నెల్లూరు, 22న చిత్తూరు, జులై 2న అనంతపురం, అదే నెల 12న కర్నూలు, 21న ఆదిలాబాద్, ఆగస్టు 1న నల్లగొండలో శతరూప కార్యక్రమాలు ఉంటాయని, ముగింపు కార్యక్రమం హైదరాబాద్ ఆగస్టు 21 నుంచి 30 వరకు నిర్వహిస్తామని అన్నారు.
రూ.3 కోట్లతో రవీంద్రభారతి, తెలుగు లలిత కళా తోరణంలో మరమ్మతులు చేయనున్నట్లు రమణమూర్తి, కాంతారావు తెలిపారు. లలిత కళాతోరణంలో మినీ థియేటర్‌ను నిర్మించే యోచన ఉందని అన్నారు. ఎంపిక చేసిన 13 విభాగాలకు చెందిన 26 మంది కళాకారులకు కళారత్న హంస అవార్డులతో సత్కరించనున్నామని, దీన్ని వచ్చేనెల రెండవ వారంలో నిర్వహిస్తామని అన్నారు. హంస అవార్డులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దు తామని చెప్పారు.