న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: డిప్యూటీ సీఎం, స్పీకర్, పీసీసీ చీఫ్ పోస్టుల భర్తీ వ్యవహారం ఒక కొలిక్కివచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్, తన రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్‌తో కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ జరిపిన సమావేశంలో ఈ పోస్టులపై కసరత్తు ముగించారని, వారంలోగానే వీటిని భర్తీ చేసే అవకాశాలున్నాయని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఆ వర్గాలు చెబుతున్న ప్రకారం... డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని తెలంగాణకు చెందిన మంత్రి దామోదర రాజనర్సింహకు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చారు.
స్పీకర్ పదవి విషయంలో ప్రస్తుత ఉపసభాపతి నాదెండ్ల మనోహర్, సీఎం సన్నిహితుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్లు పరిశీలనకు వచ్చాయి. డిప్యూటీ సీఎం పదవి ఆశిస్తున్న మంత్రి జె.గీతారెడ్డి పేరు కూడా లెక్కలోకి తీసుకున్నారు. రాష్ట్ర పార్టీ సారథ్యం విషయంలో ఐదు పేర్లను (కె.ఆర్.సురేశ్‌రెడ్డి, షబ్బీర్ అలీ, బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీనారాయణ) పరిశీలించారు. సురేశ్‌రెడ్డికే ఈ పదవిని ఇవ్వాలని సీఎం కోరగా, మైనారిటీకి చెందిన షబ్బీర్ అలీకి ఇస్తే బాగుంటుందని ఆజాద్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. |