మహిళలకు 50% రిజర్వేషన్లు

మహిళలకు 50% రిజర్వేషన్లు
స్థానికంలో సగం సీట్లు వారికే..
మహిళా సాధికారత పరిరక్షణకు పథకాలు

క్రెడిట్ లింకేజీకి సమగ్ర ప్రణాళిక..
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్, ఏప్రిల్ 3 : పంచాయతీరాజ్, పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా రిజర్వేషన్లపై సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు ప్రారంభించారు.

యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ నేతృత్వంలో రాష్ట్రంలో మహిళా రిజర్వేషన్ల అమలుకు చట్టాలను రూపొందించడంపై ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నట్లు సీఎం కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా స్థానికసంస్థల్లోని అన్ని కేటగిరిలలోనూ 50% రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించే రిజర్వేషన్లలో సగం స్థానాలతో పాటు జనరల్ కేటగిరిలోనూ సగంసీట్లు మహిళలకు కేటాయిస్తారు.

రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మహిళలకు '1/3 వంతుకు తగ్గకుండా' రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇక నుంచి 50 శాతానికి చేరుస్తూ సవరణ చేస్తారు. పంచాయతీలు, మండల పరిషత్‌లు, జడ్పీలలో నే రుగా ఎన్నికయ్యే పదవులతో పాటు పరోక్ష పద్ధతిన నియమితులయ్యే మండల, జడ్పీ చైర్మన్ పదవులకూ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఛత్తీస్‌గఢ్, మణిపూర్, ఉత్తరాఖండ్, బీహార్, రాజస్థాన్, మద్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోని స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి.

మహిళా సాధికారిత, మహిళల హక్కుల పరిరక్షణ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 10 లక్షల వరకు గల మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)లో కోటి మందికి పైగా సభ్యులున్నారు. ఈ సభ్యుల ఆదాయాన్ని గణనీయంగా పెంచేందుకు రుణ సౌకర్యంతో క్రెడిట్ లింకేజీని ఏర్పాటు చేసేందుకు సమగ్రమైన ప్రణాళికలను ప్రభుత్వం రూపొందిస్తోంది. మహిళా సాధికారత కోసం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్నారు.
ముఖ్యంగా సంఘాలకు ఇచ్చే రుణాలపై పావలా వడ్డీ పథకం అమలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులకు అభయ హస్తం పథకం ద్వారా కనీసం రూ.500ల నుంచి రూ.2200ల వరకు నెల వారీ పెన్షన్, ఇందిరమ్మ గృహాలను మహిళల పేరిట రిజిస్ట్రేషన్, దీపం పథకంలో వంట గ్యాస్ కనెక్షన్‌ను మహిళలకు మంజూరు చేయడం, వృత్తి విద్యా కోర్సుల్లో బాలికల కు మూడో వంతు సీట్ల కేటాయింపు వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అన్ని రంగాల్లోనూ మహిళల భాగ స్వామ్యాన్ని సగానికి చేర్చడం ద్వారా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.ఆంధ్ర జ్యోతి సౌజన్యముతో