శంకరన్ కు సలాం

బతుకు మీద చీకటి తెరలు
పరుచుకున్నప్పుడు
కనీసం ఒక సన్నని వెలుగు రేఖ కావాలి
కాళ్ళ కింద భూమి సైతం కదలబారి
ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు
ఒడ్డున వున్న గడ్డి పరకైనా చేతికి చిక్కాలి
ఆకలై గుక్కపట్టిన అల్లాడే పిల్లాడికి
కాస్తంత ఓదార్చే అమ్మతనం కావాలి
అణగారిన బతుకుల ఆంక్రందనలు
మట్టి మనుషుల రోదనలు విని
కాలం కన్న శంకరన్ కు సలాం
ఐఏఎస్ జీవన శైలికి
కొత్త అర్ధం చెప్పిన ‘ఋషి‘ వి నీవు
ఎందరో అధికారులకు
ఆదర్శమూర్తివి నువ్వు
ఆదివాసీలను అక్కున చేర్చుకున్న
‘హెమాండర్ఫ్’ వి నువ్వు
సోషల్ వెల్ ఫేర్ విద్యార్ధులు
పుస్తకాల్లో భద్రంగా దాచుకున్న
నెమలి కన్నువి నువ్వు
మధ్యరాత్రి మహానగరం
మత్తుగా నిద్రపోతుంటే...
ఒంటరిగా నువ్వు మాత్రం నిరంతరం పరిశోధకుడిలా
పుస్తకాలు వెదుకుతుంటావ్

ఉద్యమాలకు – రాజ్యానికి
వారధి నువ్వే కదా

నీ మౌనంలో ఒక నిశ్శబ్ద విప్లవం
నీ అడుగు కదిలితే ఒక ఆదేశం
నీ పెదవి కదిపితే ఒక ఉపదేశం
మానవతా సౌరభాలను వెదజల్లే
మహా మనీషివి కదా నువ్వు
మట్టి మనుషులకు కొత్త యుగాన్ని
ఆవిష్కరించాలని కదా నీ తపన

ఈ భూమ్మీద ‘శంకరన్’
ఇలా జీవించాడంటే ....
రాబోయే తరాలు నమ్మరేమో

దుర్మార్గపు పరిస్థితులకు
లొంగిపోయి బతకడం కదా చావంటే
ఏ ప్రలోభాలకు లొంగని నీకు
చావెక్కడ శంకరన్ ?
నీకు నిలువెత్తు సలాం
--- కత్తి కళ్యాణ్
ఫోను: 09704501017

( బహుజన కెరటాలు మాసపత్రిక, అక్టోబరు 2010 సౌజన్యంతో...

No comments: