కుల దురహంకార హత్యలు


రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలూ, అమానుషాలూ, దాడులూ, దౌర్జన్యాలూ ప్రతి ఒక్కరి మనసునూ కదిలించేలా వున్నాయి. కారణాలు-కాలాలు, ప్రాంతాలు-పాత్రలు వేరైనా ఈ దారుణ దృశ్యాలన్నిట్లోను బాలికలు, మహిళలే సమిధలు కావడం విషాదం. పురుష దురహంకారము, కుల క్రౌర్యమూ వేయి చేతులు చాచి అమాయక మహిళలను బలితీసుకోవడం నవ నాగరిక సమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన చర్య. ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఖండనలకు, ప్రకటనలకు మాత్రమే పరిమితం కావడం బాధ్యతారాహిత్యానికి, రాజకీయ చిత్తశుద్ధి లేమికి నిదర్శనం మినహా మరోటి కాదు. అపురూపంగా చూసుకోవాల్సిన ఆడపిల్లలు, మహిళల ప్రాణాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి, పురుషాహంకారానికి, కుల దురహంకారానికి గాల్లో దీపాల్లా కొండెక్కిపోతున్నాయి. సర్కారు వైద్యుల నిర్లక్ష్యమూ, అత్యవసర ఔషధాలను అందుబాటులో వుంచాల్సిన ప్రభుత్వ బాధ్యతా రాహిత్యమూ ర్యాబిస్‌ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అనూష ప్రాణాలను బలిగొంది. 'కాపాడలేవా అమ్మా' అన్నట్టు తననే దీనంగా చూస్తూ కానరాని లోకాలకు వెళ్లిపోయిన కూతురును మరవలేని ఆ నిరుపేద తల్లి ఆవేదన అర్థమయ్యేదెందరికి? తననే ప్రేమించాలని, పెళ్లాడాలని వేధించి, నిరాకరించిన పాపానికి పాఠశాల ఉపాధ్యాయిని సుందరమ్మ ప్రాణాలు తీశాడో విశాఖ మృగాడు. ప్రేమించడానికి అవసరం లేని కట్నం పెళ్లి చేసుకోడానికి మాత్రం తప్పనిసరట! ఇదెక్కడి న్యాయమని అడిగితే కట్నమే పరిష్కారమని తెగేసి చెప్పాడో ఆదిలాబాదీ. నాడు తియ్యతియ్యటి ప్రేమ పాఠాలు వల్లించి వలలో వేసుకుని నేడు తిరస్కరణ అస్త్రాన్ని సంధించేసరికి తట్టుకోలేక ఆరిపోయిందో అమాయక జ్యోతి. చట్టాన్ని, న్యాయాన్ని అనుక్షణం కాపాడాల్సిన కానిస్టేబులే ప్రేమ పేర వంచించి మరో యువతిని పెళ్లాడాడు. పెద్దల ఆశీస్సులతో అతగాడి జీవితం సెటిలై పోయినా...సూటిపోటి మాటలతో కాకుల్లా పొడుచుకుతినే లోకుల మధ్య ఒంటరైంది మాత్రం ఒక మహిళే. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న యువతకు ముఖ్యంగా మహిళలకు ఎదురయ్యే కష్టనష్టాలు, చేదు అనుభవాలు ఎన్నెన్నో?! తక్కువ కులాల వారిని పెళ్లాడిన అమ్మాయిలకు మన రాష్ట్రంలోనూ ఈ భూమ్మీద నూకలు చెల్లిపోతున్నాయి. కని, పెంచి, పెద్దచేసిన అమ్మానాన్నలే కుటుంబ గౌరవం పేరిట యమకింకరుల అవతారమెత్తి ప్రాణాలు హరించడం కలవరపెడుతోంది. మహబూబ్‌నగర్‌ మాధవి, శ్రీకాకుళం లల్లి చేసిన నేరమల్లా దళిత యువకులను ప్రేమించడమే. నిర్దయగా కన్నవారే వారిద్దరినీ కాటికి సాగనంపేశారు. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడాన్ని పరువు తక్కువగా భావించిన ఓ తండ్రి ఏకంగా గోదావరిలో దూకి ప్రాణాలు తీసుకోవడం వంటి దృశ్యాలు నోట మాట రాకుండా చేస్తున్నాయి. సామాజిక అసహనం ఇప్పటికే మన రాష్ట్రంలో ఎంతలా విభ్రాంతి కలిగించే స్థాయిలో వుందో తెలుస్తోంది. ఇక్కడ కూడా మొదటగా బలవుతోంది మహిళలే.
పరువు పేరిట కుల దురహంకారంతో మహిళలను మట్టి చేసే సంస్కృతి ఉత్తరాదికే పరిమితమని ఎవరైనా భావిస్తుంటే ఈ దారుణ ఉదంతాలు వారికి కనువిప్పు కల్గించాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో పరువుహత్యలపై జరిగే క్రతువును ఖండించడానికి ప్రజాప్రతినిధులు సైతం ముందుకు రారు. ఓట్లకోసం చూసీచూడనట్టు నటిస్తుంటారు. మన రాష్ట్రంలో ఈ విషయంలో ఏవైనా భిన్న పరిస్థితులున్నాయా? అని ప్రశ్నించుకుంటే ఒళ్లు గగుర్పొడిచే సమాధానమే లభిస్తుంది. మహిళాసంఘాలు, అభ్యుదయకాముక శక్తులు అరచిగీపెట్టినా, పార్లమెంటులో చర్చ లేవదీసినా ప్రయోజనం స్వల్పం. వామపక్షాలు మరీ ముఖ్యంగా సిపిఎం మినహా మరెవరూ ఈ సమస్య పరిష్కారానికి, చర్చకు, చట్టరూపకల్పనకు కదలలా! కంఠం విప్పలా! ప్రస్తుతం కుల రాజకీయాలు క్రియాశీలమౌతున్న మన రాష్ట్రంలో కులదురహంకార హత్యలు పెరిగిపోతున్నాయి. కులాంతర వివాహాలకు యువతీ యువకులు ముందుకు రావడం సంతోషకరం. అయితే అలాంటి పెళ్లిళ్లు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా నిలదొక్కు కోవాలంటే దళితులు, ఇతర కిందికులాల ఆర్థిక స్థితిలోనూ మార్పు రావాలి. ప్రభుత్వాలు ఇందుకు పూనుకోవాలి. పూనుకొనేలా చేసే ఉద్యమాలు రావాలి. కుల దురహంకారంతో జరిగే హత్యలను హానర్‌ కిల్లింగ్స్‌గా ఇంగ్లీషు మీడియా అభివర్ణించడం కూడా విస్మయం కలిగించేదే. తెలుగులో కిల్లింగ్‌ను హత్యగా పేర్కొనడం సముచితమే. అయితే దురహంకారాన్ని పరువుగా పేర్కొనడ మెందుకన్నది ఓ ప్రశ్న. పరువుప్రతిష్టలే ప్రాణంగా భావించిన తల్లిదండ్రులు తమ పిల్లలు తక్కువ కులం వారిని వివాహమాడ్డాన్ని తట్టుకోలేక బలితీసుకున్నట్టు అభివర్ణించే ధోరణి నిస్సందేహంగా తప్పుడు ధోరణే. కులదురహంకారంతో జరిగే హత్యలను అరికట్టడంపై మన ప్రభుత్వం తీవ్రంగా దృష్టి సారించాలి. ఈ హత్యాకాండలో పాల్పడినవారికి కఠినశిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి
  ప్రపంచ అమ్మ దినోత్సవ శుభాకాంక్షలు

ఎస్సీ, ఎస్టీల గోడు పట్టని సర్కార్‌                                                                          కమిషన్‌కు ఛైర్మన్‌ కరువు

  • 19,413 కేసులు పెండింగ్‌
  • హామీలు బుట్టదాఖలు
దళితులు, గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల హక్కులను కాలరాస్తోంది. వారి సమస్యలను సత్వరం పరిష్కరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2003లో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని దళిత, గిరిజనులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడం, ఎక్కడైతే దళితులు అణచివేతకు గురువుతున్నారో అక్కడ చైతన్యం తీసుకురావడం, వారి హక్కులను కాపాడటం, వివక్షతకు గురైతే తగిన న్యాయం చేయడం తదితర బాధ్యతలను కమిషన్‌ నిర్వర్తిస్తుంది. ఈ కమిషన్‌కు రిటైర్డ్‌ న్యాయమూర్తిని ఛైర్మన్‌గా నియమించాల్సి ఉంది. వివిధ దళిత, గిరిజన సంఘాలకు చెందిన నేతలు కూడా న్యాయమూర్తినే ఛైర్మన్‌గా నియమించాలని ప్రభుత్వానికి సూచించారు. కానీ, ప్రభుత్వం ఈ నియమ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ప్రొఫెసర్‌ మెరుగు నాగార్జునను ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌గా నియమించారు.
నాగార్జున ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కిందనే కాకుండా వివిధ కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా 23,773 కేసులు నమోదయ్యాయి. వీటిలో కేవలం 4,360 (19 శాతం) కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయి. మిగిలినవి ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. నాగార్జున తన వ్యక్తిగత కారణాలతో ఛైర్మన్‌ పదవికి 2009లో రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఈ కమిషన్‌కు ఛైర్మన్‌ను నియమించలేదు. ఛైర్మన్‌ను నియమించకపోవడానికి ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఆందోళన కూడా ఒక కారణమని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులత్లో ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఛైర్మన్‌గా నియమించినా ఇబ్బందులెదురవుతాయనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దళితుల సమస్యలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఇదే సమయంలో దళిత, గిరిజనులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లా అయిన చిత్తూరులో నారాయణవనం మండలం, బొప్పరాజుపాళ్యంలోని లక్షీపురం గిరిజన కాలనీలో దాదాపు 80 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరు స్వాతంత్య్రం రాకముందు నుంచి 278 సర్వే నెంబరులోని 200 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. సజ్జలు, జొన్నలు, కందులు, వేరుశనగ పంటలు పండిస్తున్నారు. కానీ వారికి ఇప్పటి వరకు ఆ భూములకు సంబంధించిన పట్టాలను ప్రభుత్వం ఇవ్వలేదు. అటవీ హక్కుల చట్టం ప్రకారం వారికి పట్టాలివ్వాలి. ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.
మరోవైపు దళిత, గిరిజనులపై అనేక రకాలుగా దాడులు, దౌర్జన్యాలు, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌ మండంలోని దళితులు భూములను అమ్ముకోకుండా వ్యవసాయం చేసుకుంటున్నారనే అక్కసుతో నలుగురిని సజీవదహనం చేశారు. సజీవదహనం సంఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. కమిషన్‌ ఉన్నట్లయితే ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి వీలుంటుందని ఎస్సీ,ఎస్టీ సంఘాల నేతలు అభిప్రాయ పడుతున్నారు. బాణామతి. చేతబడులు చేస్తున్నారనే నెపంతో పలు ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి.
దీక్షతో దిగొచ్చినా...
దళిత, గిరిజన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, ఆ పార్టీ ఇతర నేతలు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మార్చి 17న దీక్ష చేపట్టారు. ప్రధాన ప్రతిపక్షం నుంచి మొదలుకొని ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వివిధ పార్టీలు మద్దతు ప్రకటించాయి. శాసనసభలో రెండు రోజలుపాటు చర్చ జరిగింది. ఎట్టకేలకు దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. అంతే కాకుండా రాఘవులు పెట్టిన డిమాండ్లలో సాధ్యమైనన్ని పరిష్కరిస్తామని స్పష్టం చేసింది. దాదాపు రెండు నెలలు పూర్తికావస్తున్నా ఏ ఒక్క సమస్యనూ ప్రభుత్వం పరిష్కరించలేదు.

హైకమాండ్‌కు మూడ్ వచ్చింది
త్వరలో మూడు కీలక పదవుల భర్తీ
డిప్యూటీ సీఎం రేసులో రాజనర్సింహ ముందంజ

నాదెండ్లకే స్పీకర్‌గా పదోన్నతి!
ఇంకా తేలని కొత్త పీసీసీ చీఫ్
నేడు ఢిల్లీకి డీఎస్.. ఆజాద్‌తో భేటీ
కడప ఫలితాల తర్వాత ఢిల్లీకి సీఎం
న్యూఢిల్లీ, హైదరాబాద్, మే 7 : రాష్ట్ర కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులకు రంగం సిద్ధమైంది. చాన్నాళ్లుగా నాన్చుతూ వస్తున్న డిప్యూటీ సీఎం, స్పీకర్ పదవుల భర్తీతో పాటు పీసీసీ సారథ్య బాధ్యతలను కొత్త నేతకు అప్పగించే దిశగా కూడా కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు మొదలెట్టింది. ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి.. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాం«ధీని శనివారమిక్కడ కలిశారు. పార్టీ వ్యవహారాలు, తెలంగాణ అంశాలపై ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ పటేల్ వంటి కోర్‌కమిటీ సభ్యులతో శుక్రవారం చర్చించిన సీఎం.. సోనియాతో జరిపిన సమావేశంలోనూ ఆ అంశాలను ప్రస్తావించేందుకు యత్నించారు.

ఉప ఎన్నికల తరువాత పార్టీలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుడదామని సీఎంకు సోనియా ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే.. సీఎంతో సమావేశానికి ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు జె.పి.అగర్వాల్‌లు సోనియాతో సమావేశమయ్యారు. గంటకు పైగా ఈ సమావేశం జరిగింది. వీరిద్దరి మధ్య తలెత్తిన ఎన్ఎండీసీ వివాదం పరిష్కారంలో అలసిపోయిన సోనియా.. సీఎం కిరణ్‌తో జరిగిన భేటీలో.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై కూలంకషంగా మాట్లాడలేకపోయారు.

ఈ భేటీలో కడప ఉప ఎన్నికల గురించే ప్రస్తావనకు వచ్చిందని.. ఇతర అంశాలపై పెద్దగా చర్చ జరగలేదని పార్టీ వర్గాల వివరించాయి. కడప ఫలితాల తర్వాత సీఎం కిరణ్ మరో మారు ఢిల్లీ వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ సందర్భంగా.. సంస్థాగత అంశాలపై అధిష్ఠానం దృష్టి సారించనుంది. కాగా.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్ పిలుపు మేరకు పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆదివారం ఢిల్లీ వెళ్తున్నారు. ఈ భేటీలో వీరు రాష్ట్ర వ్యవహారాలపై సమగ్రంగా చర్చించనున్నారు. డిప్యూటీ సీఎం రేసులో అగ్రస్థానంలో రాజనర్సింహ!

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఇన్నాళ్లూ తనమునకలైన కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటుండడంతో.. రాష్ట్ర రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణ అంశంపై అటో ఇటో తేల్చాలన్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు అధిష్ఠానానికి ఇచ్చిన అల్టిమేటం.. దానిపై మే రెండో వారంలో మళ్లీ భేటీ అవుదామంటూ ఢిల్లీ పెద్దలు ఇచ్చిన హామీలపై అధిష్ఠానం దృష్టిసారించనున్నది. స్పీకర్, డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో నిర్ణయం తీసుకోవాలన్న దృఢ నిర్ణయంలో అధిష్ఠానం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.

ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన సమయంలో అప్పటి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ.. తెలంగాణ ప్రాంతానికి చెందినవారికి డిప్యూటీ సీఎం పదవిని ఇస్తామని చెప్పారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఈ పదవి లభిస్తుందనీ స్పష్టం చేశారు. దీంతో.. ఈ పదవిలో మంత్రులు జె.గీతారెడ్డి, దామోదర్ రాజనర్సింహల పేర్లు నాడు ప్రముఖంగా విన్పించాయి. అయితే.. వీరిలో రాజనర్సింహ వైపే అధిష్ఠానం మొగ్గు చూపుతోందని సమాచారం.

నాదెండ్ల లేదా ఉత్తమ్‌కుమార్‌కు స్పీకర్‌గా అవకాశం
ఇక శాసనసభాపతి విషయంలోనూ అధిష్ఠానం తన నిర్ణయాన్ని వెల్లడించనున్నది. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న నాదెండ్ల మనోహర్ వైపే అధిష్ఠానం మొగ్గు చూపుతోందన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. సీఎం కిరణ్ మాత్రం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పట్ల సానుకూలంగా ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇదే సమయంలో పీసీసీ అధ్యక్షపదవి విషయంలోనూ అధిష్ఠానం ఒక ఆలోచనకు వచ్చిందని చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షునిగా మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ పట్ల సీఎం సానుకూలంగా ఉన్నట్లుగా పార్టీలో ప్రచారం ఉంది. కాగా.. ఈ పదవిలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేరు కూడా గట్టిగానే విన్పిస్తోంది. ఇక వీటితో పాటు.. శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవుల భర్తీపై కూడా అధిష్ఠానం ఒక నిర్ణయం తీసుకునే వీలుంది

కూతుళ్లను చంపిన కుల దురహంకారం

  • తెలుగు గడ్డపై రెండు హత్యలు
  • సజీవ దహనం చేసిన తల్లి, మేనమామలు
  • మరో కేసులో గొంతు నులిమిన తండ్రి
  • దళితులను ప్రేమించటం, పెళ్లి చేసుకోవడమే కారణం
హర్యానా, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న ఆటవిక చర్యలు... తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోనూ జరిగాయి. ఆధునిక సమాజంలో ఈ అనాగరిక చేష్టలు ఏంటని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల తీవ్రంగా స్పందించడానికి కారణమైన కుల దురహంకార హత్యలకు ప్రస్తుతం మన రాష్ట్రం కూడా వేదికగా నిలిచింది. తక్కువ కులం వ్యక్తిని (దళితున్ని) పెళ్లి చేసుకున్న కారణంగా కూతురిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా ఉసురు తీశారు. గర్భిణిగా ఉన్నా ఏ మాత్రం కనికరం లేకుండా పాశవికంగా దాడి చేసి, హత్య చేశారు. మైనార్టీ తీరిన ఆ యువతి, తాను భర్తతోనే ఉంటానన్నా ససేమిరా అన్నారు. బలవంతంగా నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లిన ఆమె తల్లి, మానమేమలు... రాళ్లతో కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఆపై పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. అటు మానవత్వానికి, ఇటు మాతృత్వానికి మచ్చ తెచ్చిన ఈ సంఘటన పాలమూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఇదిలావుండగా, దళతున్ని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పిన కూతుర్ని దారుణంగా హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు శ్రీకాకుళంలోని ఒక తండ్రి. కుల పంచాయతీలు (ఖాప్‌ పంచాయతీలు) లేని తెలుగు గడ్డపైనా రెండు ఘోరాలు జరిగిపోయాయి. ఆడబిడ్డల నిండు ప్రాణాలను కన్నవారే నిలువునా తీసేశారు.
తమను కాదని... దళిత యువకున్ని పెళ్లాడిన కన్న బిడ్డను కాల్చి చంపిన కసాయిమూకల ఘోరకలి మహబూబ్‌నగర్‌ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బాలానగర్‌ మండలం రాజాపూర్‌ (జాతీయ రహదారి పక్కనున్న గ్రామం)లో గొర్రెల పెంపకందారుల సామాజిక తరగతికి చెందిన మాధవి(18), కేశంపేట మండలం కాకునూరు గ్రామానికి చెందిన దళితుడు లింగం గత ఏడాది నవంబర్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దళితున్ని పెళ్లి చేసుకోవడం మింగుడు పడని మాధవి తల్లి శంకరమ్మ తన బిడ్డకు మైనార్టీ తీరలేదని, లింగం కిడ్నాప్‌ చేశాడనే ఆరోపణతో బాలానగర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు లింగంను రిమాండ్‌కు పంపి మాధవిని స్టేట్‌ హోమ్‌లో ఉంచారు. అనంతరం రెండు నెలల్లోనే జడ్చర్ల మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌, మాధవి మైనార్టీ తీరిందని చెప్పి హోమ్‌ నుండి తీసుకొచ్చారు. అక్కడి నుండి నేరుగా భర్త లింగం దగ్గరకు మాధవి వెళ్లింది. మాధవి అక్కడికి వెళ్లడాన్ని జీర్ణించుకోలేని తల్లి, మేనమామలు గురువారం ఉదయం ఆరు గంటలకు కాకునూరు గ్రామానికి వెళ్లారు. 'నువ్వు గర్భవతివి కదా.. మనింటికి పోదాం బిడ్డా'' అని మాధవికి కల్లబొల్లి కబుర్లు చెప్పారు. ఆ సమయంలో లింగం ఇంట్లో కూడా లేడు. ఎంతకూ పుట్టింటికి వెళ్లడానికి ఇష్టపడని మాధవిని బంధువులంతా బలవంతంగా ఆటోలో తీసుకెళ్లారు. పెద్దరేవల్లి ఏడు గుట్టల మధ్య చుట్టూ ముళ్ల కంపలు, రాళ్లూ పేరుకుపోయిన ప్రదేశానికి మాధవిని తీసుకెళ్లి రాళ్లతో కొట్టి, పెట్రోలు పోసి సజీవ దహనం చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కాకునూరుకు, సంఘటన జరిగిన పెద్దరేవల్లి గ్రామాలకూ ఎలాంటి సంబంధం లేదు. అటువంటి మారుమూల ప్రాంతానికి మాధవిని తీసుకెళ్లి చంపేశారు. ఈ విషయాన్ని పెద్దరేవల్లి గ్రామస్తులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పోలీసులు లింగం సొంత ఊరికి వెళ్లి విచారించగా, చుట్టుపక్కల వాళ్లు మాధవిని ఆమె బంధువులే బలవంతంగా ఆటోలో తీసుకెళ్లడం చూశామని చెప్పారు. నిందితులైన తల్లి శంకరమ్మ, మేనమామలుగా భావిస్తున్న కోడె ముత్యాలు, కోడె రాములు, మరో ఇద్దరు బంధువులు కుంచె రామయ్య, చెన్నయ్య పరారీలో ఉన్నారు. ఇదిలా ఉండగా... ఉదయం బయటికెళ్లిన మాధవి భర్త లింగం సాయంత్రం వరకు భార్య కోసం వెదుకుతూనే ఉన్నాడని, పోలీసు స్టేషన్లో తమ రక్షణలోనే అతను ఉన్నాడని షాద్‌నగర్‌ సిఐ షాకీర్‌ హుస్సేన్‌, బాలానగర్‌ ఎస్‌ఐ శంకర్‌ పత్రికల వారికి తెలిపారు. లింగం ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేశామని తెలిపారు. మాధవి దళితున్ని వివాహం చేసుకున్నందునే తల్లిదండ్రులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని, నిందితులను తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కెవిపిఎస్‌ షాద్‌నగర్‌ డివిజిన్‌ కార్యదర్శి బుద్దుల జంగయ్య డిమాండ్‌ చేశారు.
దళితున్ని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పిన కూతుర్ని హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఓ కసాయి తండ్రి ఉదంతమిది. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం రట్టిణికి చెందిన లలిత్‌ కుంటియా, గొల్లపు కుంటియా ఉపాధి కోసం చెన్నై వలసవెళ్లారు. వారి కుమార్తె లల్లి కుంటియా (19) అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. ఒడిషాలోని ఒడ్రు కులానికి చెందిన ఆమె దళిత కులానికి చెందిన అలజండి మోహనరావును ప్రేమించింది. ఈ నెల 20న టిటిడి ఆధ్వర్యాన నిర్వహించనున్న కల్యాణమస్తులో వివాహం చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. అందుకోసం తన సర్టిఫికెట్లు, బంగారం, డబ్బులు ఇవ్వాలని లల్లి కుంటియా బుధవారం ఇంటికి వచ్చి తల్లిదండ్రులను అడిగింది. దీంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన తండ్రి లలిత్‌ కుంటియా బుధవారం రాత్రి గొడవపడి, పీక నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని గురువారం గ్రామస్తులకు చెప్పాడు. విషయం తెలుసుకున్న పాలకొండ డిఎస్పీ బిడివి సాగర్‌ ఆధ్వర్యాన పాతపట్నం, రాజాం సిఐలు ఎ.రవికుమార్‌, ఎస్‌.శశిభూషణరావు సంఘటనా స్థలానికి చేరుకుని, తల్లిదండ్రులను ప్రశ్నించారు. దళిత యువకున్ని పెళ్లి చేసుకుంటుందని తానే కుమార్తెను హత్య చేశానని లలిత్‌ అంగీకరించాడు. మెళియాపుట్టి ఎస్‌ఐ సూరినాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీలపై దాడులకు పాల్పడితే కఠినంగా శిక్షించండి

న్యూఢిల్లీ, మే 3: ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని, అందుకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఇప్పటికీ మనుషులతో కొనసాగిస్తున్న పాకీ పనిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా గత నెలలో జరిగిన నేరాల ప్రస్తుత పరిస్థితిపై నివేదికను ఆ శాఖ పరిశీలించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు దేశీయ వ్యవహారాల శాఖ పలు సూచనలను జారీ చేసింది.

దాని ప్రకారం.. పోలీసు లు, శాంతిభద్రతలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని అం శం కాబట్టి నేరాలు జరగకుండా నిరోధించడానికి అవి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వా లు ప్రత్యేక దృష్టి సారించాలని కోరింది. ఇండియాలో ఇంకా మనుషు ల చేత పాకీ పని చేయించడం దారుణమని, దాన్ని నిషేధిస్తూ చట్టం తెచ్చి 17 ఏళ్లయినా ఎవరూ శిక్షింపడలేదని ఆ శాఖ సూచనల్లో పే ర్కొంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పూ ర్తిగా దానిని నిర్మూలించడానికి అత్యవసర కృషి చేయాలని తెలిపింది.

గ్రామ సేవకుల ధర్నా

మానకొండూర్, ఏప్రిల్ 29 : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం గ్రామ సేవకులు ధర్నా చేశారు. మం డల గ్రామ సేవకుల అధ్యక్ష, ఉపాధ్యక్షులు పిల్లి రాములు, ఉండింటి రాంప్రసాద్ మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రూ. 5 వేలు, డీఎ రూ. 50 నుంచి రూ. 100 పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న గ్రామ సేవకుల పోస్టులను భర్తీ చేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

2009 ఫిబ్రవరి 5న రాష్ట్ర వ్యాప్తంగా 46 రోజుల సమ్మె చేయగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలతో పాటు డీఎ పెంపు ఆర్థికేతర సమస్యల పరిష్కరిస్తామని చెప్పిన ఆచరించడం లో ప్రభుత్వం విఫలం అయిందన్నా రు. కార్యక్రమంలో దుర్గయ్య, అంజ య్య, కుంభం కుమారస్వామి, కిశోర్, కనకయ్య, కొంరయ్య, కుమారస్వామి, రాములు, మొండయ్య, పాల్గొన్నారు.

తిమ్మాపూర్ : గ్రామ సేవకులు వారి డిమాండ్ల సాధనలో భాగంగా శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదు ట ధర్నా నిర్వహించారు. జిల్లా పిలుపుమేరకు గ్రామ సేవకుల సంఘం మండ ల అధ్యక్షుడు కొమురయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రమేశ్, అశోక్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

రామడుగు : మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామసేవ కులు ధర్నాచేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు సిరికొండ అంజయ్య, రమేశ్, మామిడిపెల్లి నర్సయ్య, లేవుటు కనుకయ్య, గునుకొండ లచ్చయ్య, కమలాకర్, రవీందర్, పోచయ్య, ఎల్లయ్య, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.