- 19,413 కేసులు పెండింగ్
- హామీలు బుట్టదాఖలు
నాగార్జున ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కిందనే కాకుండా వివిధ కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా 23,773 కేసులు నమోదయ్యాయి. వీటిలో కేవలం 4,360 (19 శాతం) కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయి. మిగిలినవి ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. నాగార్జున తన వ్యక్తిగత కారణాలతో ఛైర్మన్ పదవికి 2009లో రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఈ కమిషన్‌కు ఛైర్మన్‌ను నియమించలేదు. ఛైర్మన్‌ను నియమించకపోవడానికి ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఆందోళన కూడా ఒక కారణమని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులత్లో ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఛైర్మన్‌గా నియమించినా ఇబ్బందులెదురవుతాయనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దళితుల సమస్యలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఇదే సమయంలో దళిత, గిరిజనులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లా అయిన చిత్తూరులో నారాయణవనం మండలం, బొప్పరాజుపాళ్యంలోని లక్షీపురం గిరిజన కాలనీలో దాదాపు 80 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరు స్వాతంత్య్రం రాకముందు నుంచి 278 సర్వే నెంబరులోని 200 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. సజ్జలు, జొన్నలు, కందులు, వేరుశనగ పంటలు పండిస్తున్నారు. కానీ వారికి ఇప్పటి వరకు ఆ భూములకు సంబంధించిన పట్టాలను ప్రభుత్వం ఇవ్వలేదు. అటవీ హక్కుల చట్టం ప్రకారం వారికి పట్టాలివ్వాలి. ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.
మరోవైపు దళిత, గిరిజనులపై అనేక రకాలుగా దాడులు, దౌర్జన్యాలు, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండంలోని దళితులు భూములను అమ్ముకోకుండా వ్యవసాయం చేసుకుంటున్నారనే అక్కసుతో నలుగురిని సజీవదహనం చేశారు. సజీవదహనం సంఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. కమిషన్ ఉన్నట్లయితే ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి వీలుంటుందని ఎస్సీ,ఎస్టీ సంఘాల నేతలు అభిప్రాయ పడుతున్నారు. బాణామతి. చేతబడులు చేస్తున్నారనే నెపంతో పలు ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి.
దీక్షతో దిగొచ్చినా...
దళిత, గిరిజన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, ఆ పార్టీ ఇతర నేతలు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మార్చి 17న దీక్ష చేపట్టారు. ప్రధాన ప్రతిపక్షం నుంచి మొదలుకొని ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వివిధ పార్టీలు మద్దతు ప్రకటించాయి. శాసనసభలో రెండు రోజలుపాటు చర్చ జరిగింది. ఎట్టకేలకు దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. అంతే కాకుండా రాఘవులు పెట్టిన డిమాండ్లలో సాధ్యమైనన్ని పరిష్కరిస్తామని స్పష్టం చేసింది. దాదాపు రెండు నెలలు పూర్తికావస్తున్నా ఏ ఒక్క సమస్యనూ ప్రభుత్వం పరిష్కరించలేదు.