చంటిబిడ్డ కెవ్వుమంటే చాలు, కన్నపేగు కదిలిపోతుంది. చిన్నారి కేరుమంటే  చాలు, తల్లిమనసు తుళ్లిపడుతుంది. ఎక్కడున్నా ఒక్క క్షణంలో బిడ్డముందు వాలి  అక్కున జేర్చుకుంటుంది. అలాంటి అమ్మే తన బిడ్డను కాదనుకుని చేతులారా మరో  చేతికి అందించిందంటే? అందుకు కారణం ఆ కన్నతల్లి కర్కశురాలా, కారుణ్యం  లేనిదా, కాఠిన్యురాలా? బిడ్డ చిరునవ్వు చూసి లోకాన్ని మరచిపోయే తల్లుల్ని  చూశాం. పసికందుకోసం కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదురీదే అమ్మల్ని చూశాం.  అమ్మతనపు కమ్మదనం సాక్షిగా, మమతల మాధుర్యం తోడుగా ప్రపంచాన్ని ఎదుర్కొనే  కడుపుతీపిని చూశాం. కానీ మంచాల మండలంలోని తల్లులు తమ ప్రేమాప్యాయతలకన్నా,  ముద్దుమురిపాలకన్నా బిడ్డ కడుపు నిండటమే ముఖ్యమనుకున్నారు. తమవద్ద ఉండి  పస్తులుండేకన్నా ఎక్కడున్నా తమ బిడ్డలు సుఖంగా ఉంటే చాలనుకునే  నిస్సహాయస్థితిలో వారున్నారు. పిల్లల భవితవ్యంకోసం గత్యంతరంలేక అనురాగాన్ని  గుండెలోతుల్లో అదుముకున్న మాతృమూర్తులు వారు! పేదరికంముందు ఓడిపోయిన  పేగుబంధపు దీనగాథలు వారివి.
	 
	అది మంచాల మండలం. అవి పచ్చని పర్వతాల మధ్య ఒద్దిగ్గా ఒదిగిపోయిన గిరిజన  తండాలు. కొండలమధ్య కొలువుతీరిన చిన్న చిన్న కమతాలు. అక్కడంతా వర్షాధారిత  పంటలు. కూలిపని, కాకుంటే చిట్టడవుల్లో కట్టెలు కొట్టుకొచ్చి అమ్ముకోవడం,  లేకుంటే ఉపాధి హామీ పథకం... ఇవే వారి జీవనాధారం. ఒకరికొకరు సాయంగా,  కష్టసుఖాలు పంచుకోవడం వారికెవరూ ప్రత్యేకంగా నేర్పనక్కర్లేదు. అపరిచితులైనా  ఆదరంగా మాట్లాడటమే కాదు, ఉన్నంతలో కడుపునింపడమూ వారికి తెలుసు. రాజధాని  నగరానికి కూతవేటు దూరంలోనే ఉన్నా నగరజీవనానికి దూరంగా ఉన్నట్లే ఉంటుంది  అక్కడి అభివృద్ధి, ఆ ప్రజల జీవనరీతి. అయితే నేడు ఆ తండాల గురించి పదిమందీ  చర్చించుకుంటున్నారు. ఒకటికి పదిసార్లు అక్కడికి పరామర్శిస్తున్నారు. కారణం  అక్కడ అమ్మాయి పుడితే మరొకరికి పెంపకానికి ఇస్తున్నారు. అదికూడా చాటుగా  కాకుండా శిశువిహార్‌కు వెళ్లి మరీ తమ బిడ్డల్ని అందజేస్తున్నారు. కొండొకచో  అమ్ముకుంటున్నారు. ఇది న్యాయమా, అన్యాయమా అని నిర్ణయించేముందు మా  స్థితిగతులను ఓసారి పరిశీలించండి అంటున్న ఆ తండావాసుల మాటల్లో న్యాయం ఉంది.  వారిది దిక్కుతోచని దయనీయ స్థితి. ఏ కష్టంచేసి పిల్లల కడుపునింపాలో  తెలియని దుస్థితి. కంటికెదురుగా కనిపించే అపరిమిత ఆడసంతతి. ఇల్లాలి  కంటికొసల్లో నిత్యం జాలువారే కన్నీరే వారికున్న ఏకైక ఆస్థి. ఈ  పరిస్థితుల్లో వారికి కనిపిస్తోంది ఒకటే మార్గం! అమ్మాయిని పెంపకానికి  ఇవ్వడం!
	కారణం తెలుసుకోండి!
	ఇందుకు కారణం అడిగితే, ''ఏం చేయమంటారు చెప్పండి? మేమెలాగూ  పస్తులుంటున్నాం. మా బిడ్డలూ అదే రీతిన బతకాల్నా? ఎక్కడున్నా మా బిడ్డ  కడుపునిండా తింటే మాకంతకన్నా ఇంకేం కావాలి?'' అంటున్న రవాత్ వరంగ  కొర్రవాని తండాకు చెందిన యువతి. మొదటి భార్యకు సంతానం లేదని ఆమె భర్త 20  యేళ్ల తరువాత వరంగను పెళ్లాడాడు. వారికి సూదిమొనంత పొలం లేదు. రోజు కూలిమీద  ఆధారపడి బతకాల్సిందే! వరంగకు వరుసగా ఐదుగురు ఆడపిల్లలు. ఉన్న బిడ్డలకే  పిడికెడు బువ్వ పెట్టలేని తమకు ఐదో సంతానం కూడా 'ఆడదే' కావడంతో వారికేం  చేయాలో తోచలేదు. అందుకే అంగన్‌వాడీ సభ్యురాలిని సంప్రదించి బిడ్డను  శిశువిహార్‌లో అప్పగించారు.
	ఆంబోతుతండాకు చెందిన లలితకు రెండో సంతానంగా ఆడపిల్ల పుట్టింది. కలోగంజో  తిని కడుపునింపుకునే వారికి మళ్లీ ఆడపిల్ల అనేసరికి గుండెల్లో వణుకు  మొదలైంది. మొదటి సంతానానికి పుట్టినరోజు వేడుకలు సంబరంగా చేసినవారు  కాస్తా... రెండో సంతానాన్ని మరొకరికి ఇచ్చేయాలనుకున్నారు. ఆలోచన రావడం  ఆలస్యం ఆ పనిచేశారు కూడా! కానీ మీడియాలో విషయం పొక్కేసరికి అధికారులు లలిత  ఇంటికొచ్చారు. బంగారుబొమ్మలాంటి ఆ బిడ్డను తిరిగి తల్లిఒడికి చేర్చారు.  లలిత, ''మా కష్టాలు మీకేం తెలుసు. తినడానికే గతి లేదు కానీ, వీళ్లనెలా  సాదాలి, చదివించాలి, లక్షలు(వారికీ కట్నాలు లక్షల్లోనే ఉన్నాయి!) కట్నంపోసి  పెళ్లిచేయాలి?'' అంటోంది. ''అదే మగబిడ్డయితే సాదేదానివిగా?'' అంటే,  ''అవును! వాడికి కట్నం వస్తుంది. వాడు సంపాదిస్తే అదంతా మాకే మిగులుతుంది''  అని సమాధానం చెబుతోంది. సమాజ దుష్పరిణామాలు మనిషి ఎక్కడున్నా, ఏ మూలనున్నా  తమ పరిధిలోకి లాక్కుంటాయి. అన్నెంపున్నెం యెరుగని ప్రజలపై తన ప్రభావం  చూపుతాయి. వారి స్థితిగతులనే కాదు, మనిషి ఆలోచనాస్థాయిని  దిగజారుస్తాయనడానికి ఇంతకన్నా మరో తార్కాణం ఉందా?
	ఇది కొత్తగా వచ్చిన మార్పు
	
	వీరి ప్రపంచం పూర్వమిలా ఉండేది కాదు. మొదట్లో ఆ తండాల్లో అమ్మాయి  పుట్టిందంటే పండుగే! అమ్మాయిని పెళ్లి చేసుకోవడంకోసం 'ఓలి' మేమిస్తామంటే  మేమిస్తామంటూ అబ్బాయిలు పోటీపడేవాళ్లు! అలాంటిది చుట్టూ ప్రపంచాన్ని చూసి  'ఓలి' కాస్తా 'వరకట్నం'గా రూపుదాల్చుకుంది. అప్పుడే... మగబిడ్డ పుడితే  చాలు, కాసులు రాలతాయనే ఆశకు బీజంపడింది. ఆశ దురాశ కావడం ఎంతసేపు? ఆ దురాశ  ఆడపిల్ల పుట్టగానే చంపడానికి దారితీసింది. అబార్షన్లు వారికి తెలియవు,  తెలిసినా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే బిడ్డ నోట్లో వడ్లగింజవేయడం,  సర్ఫునీటిలో ముంచి చంపడం. రానురాను బిడ్డను మట్టుబెట్టడం తప్పని ఈ తరానికి  అర్థమైంది. అందుకే బిడ్డను చంపకుండా బిడ్డను పెంచుకోవడానికి ఇస్తున్నారు.  గొడవలురాకుండా అంగన్‌వాడీ సభ్యులద్వారా శిశువిహార్‌లో అందిస్తున్నారు.  తరచిచూస్తే చుట్టుపక్కల తండాల్లో ఇలాంటి ఉదాహరణలు మరెన్నో!
	ఇక్కడి యువత ఎక్కువశాతం నగరానికొచ్చి ఆటోలు నడుపుతారు. లేదంటే మూకుమ్మడిగా  'దేశం' వెళ్లి అంతాఇంతో ఆర్జిస్తారు(ఆ కాంట్రాక్టర్లు వీరిని దోచుకోవడం  వేరే విషయం!). ఆపై తండాకొచ్చి 'సంపాదిస్తున్నాం. కనుక కట్నం ఇవ్వండి' అంటూ  ప్రకటిస్తారు. ఇవన్నీ చూస్తూ ఎవరైనా 'మగబిడ్డ'ను కాక ఆడపిల్లను మనసారా ఎలా  స్వాగతిస్తారు? అంతేకాదు, వీరి వివాహరీతులూ మారిపోయాయి. తమ పద్ధతులు మానేసి  హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అంటే, తమ రీతి  రివాజులను వదిలేసి చుట్టుపక్కల సంస్కృతిని అలవర్చుకుంటున్నారు. ప్రతి  అంశంలోనూ చాపకింద నీరులా పాకుతున్న మార్పులు వారి అస్థిత్వానికే  ప్రశ్నార్థకంగా మారాయి.
	ప్రభుత్వం ఏర్పాటుచేసిన వసతిగృహాలు, రిజర్వేషన్ల గురించి వీరికి తెలిసింది  తక్కువ. వినియోగించుకోవడంపై అవగాహన తక్కువ. ఆర్థిక స్థితిగతులకు తోడు  అవగాహనారాహిత్యం, నిరక్ష్యరాస్యత, సదుపాయాల లేమి, ప్రభుత్వ నిర్లక్ష్యం  వీరిని మరింత అట్టడుగుకు లాక్కెళ్తున్నాయి.
	తప్పు వారిది కాదు!
	ఆ తండావాసులు పిల్లలను మరొకరికి ఇవ్వడాన్ని గురించి విని, చదివి అమ్మతనంపై  మచ్చ, మానవత్వంలేని మనుషులు, పాషాణ హృదయాలు అనుకోక... కన్నపేగు బంధాన్నే  ఛిద్రంచేస్తున్న అంశాలను అర్థంచేసుకోవాలి. పసిపిల్లల బోసినవ్వులు,  అల్లరిచేష్టలు ఎవరికి మాత్రం చేదు? పిల్లల ముద్దుమురిపాలకు మురిసిపోని  తల్లులుండరు. అలాంటి వెన్నలాంటి మాతృహృదయం బండరాయిగా మారిందంటే? దాని వెనుక  వారిని పరోక్షంగా ప్రేరేపిస్తున్న స్థితిగతులను తప్పు పట్టాలనిపిస్తుంది  తప్ప తప్పు వీరిది అనిపించదు. వీరిని నిందించడానికి మనసు ఒప్పదు. డబ్బు,  లోకంపోకడలు, జరుగుతున్న పరిణామాలు, ప్రపంచీకరణ... ఇవన్నీ నాగరిక జీవితానికి  దూరంగా... సుదూరంగా జీవనం సాగిస్తున్నా ఈ గిరిజన తండాలపై పడుతోంది. ఏమూల  దాగున్నా మనిషిపై తన కోరలు ఎలా చాపుతుందో చెప్పడానికి ఇంతకన్నా బలమైన  సాక్ష్యాలేం కావాలి? బైటి ప్రపంచప్రభావం తండావాసుల పాలిట యమపాశమై... వారి  ప్రేమపాశాన్నే శాసిస్తోందనడానికి ఇంతకంటే రుజువులేం కావాలి?!
	 
	పెళ్లికన్నా చదువే మిన్న!
	పల్లవి పదహారేళ్ల అమ్మాయి. ఆ పొరుగింట్లోని నలభైఐదేళ్ల వ్యక్తికి మొదటి  వివాహం చేసుకుంటే వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. అతనికి పల్లవిపై  కన్నుపడింది. ఇది తల్లిదండ్రులకూ ఇష్టమేనని గ్రహించిన పల్లవి ఇంటినుండి  పారిపోయింది. తన పెళ్లి ప్రయత్నాలు మానేస్తామని తల్లిదండ్రులు మాటిచ్చిన  తరువాతే తిరిగి తండాకు చేరింది. చదువుకోవాలన్న ఆశ ఆమెను అలా  ప్రేరేపించింది.
	 
	చదువుకన్నా ఇంటిపనులే మిన్న!
	మౌనిక చూడచక్కని అమ్మాయి. ఆ వయసులో ఎవరైనా చదువుకోడానికి బడికెళ్తారు.  కానీ మౌనిక లేచింది మొదలు, ఇంటిపని, వంటపని చేస్తుంది. తల్లిదండ్రులు  కూలికెళ్లగా చిన్నారి తమ్ముడిని చూసుకుంటూ కాలక్షేపం చేస్తుంది. ఇంటిని  చక్కదిద్దుతున్నాను అనుకుంటుంది తప్పచదువుకోవాలన్న ఆలోచనే ఆ అమ్మాయికి  రాదు.
 
 
 


